సినిమా వార్తలు

అవార్డుల‌కు రాజ‌మౌళి ఎందుకు దూరం?


1 year ago అవార్డుల‌కు రాజ‌మౌళి ఎందుకు దూరం?

బాహుబ‌లితో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళికి అంత‌ర్జాతీయ ఖ్యాతి ద‌క్కింది. బాహుబ‌లికి వ‌చ్చిన‌, వ‌స్తున్న అవార్డులు అన్నీ ఇన్నీ కావు. రాజ‌మౌళికి ముందు నుంచీ అవార్డులు కొత్త‌కాదు. దాదాపుగా ప్ర‌తీ సినిమాకీ ఏదో రూపంలో అవార్డు వ‌స్తూనే ఉంది. బాహుబ‌లికి ఆ జోరు మ‌రింత పెరిగింది. అయితే ముందు నుంచీ రాజ‌మౌళికి అవార్డులు తీసుకోవ‌డం ఇష్టం ఉండ‌వు. ప‌ద్మ‌శ్రీ మిన‌హా ఏ అవార్డునీ ఆయ‌న తీసుకోలేదు. తాజాగా `సైమా`తో ఇది మ‌రోసారి నిరూపిత‌మైంది. దుబాయ్‌లో `సైమా` అవార్డు వేడుక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళికి అవార్డు వ‌రించింది. కానీ.. రాజ‌మౌళి దాన్ని స్వీక‌రించ‌లేదు. రాజ‌మౌళి అవార్డు తీసుకోక‌పోవ‌డం కొత్త కాదు. కానీ.. ఈసారి ఆయ‌న దుబాయ్ వ‌చ్చారు. అవార్డు ప్ర‌దానం చేస్తున్న వేదిక‌కు అతి స‌మీపంలో ఉన్నారు. కానీ అవార్డు మాత్రం తీసుకోలేదు. త‌న కుటుంబంతో జాలీగా గ‌డ‌ప‌డానికి `సైమా` కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన రాజ‌మౌళి.. అవార్డు తీసుకోవ‌డానికి రాక‌పోవ‌డం అక్క‌డున్న‌వారిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రాజ‌మౌళి ఫ్యామిలీలో అవార్డు వేడుక‌లో క‌నిపించింది ఒక్క కీర‌వాణి మాత్ర‌మే. ఆయ‌న ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా (బాహుబ‌లి) అవార్డు అందుకున్నారు. అయితే `నేను దుబాయ్ వ‌స్తాను గానీ అవార్డు తీసుకోను` అని నిర్వాహ‌కుల‌కు రాజ‌మౌళి ముందే స‌మాచారం అందించార‌ని తెలుస్తోంది.. అవార్డులు అనేవి ప్ర‌తిభ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నాలు. క‌ష్టానికి గుర్తింపు. అవార్డులు అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడేవాళ్లెంతోమంది. కానీ రాజ‌మౌళి మాత్రం `నాకు అవార్డులు వ‌ద్దు బాబోయ్‌` అన‌డం ఆశ్చ‌ర్య‌మేన‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు