సినిమా వార్తలు

వేడుక‌గా ‘ఎఫ్ 2’ఆడియో విడుద‌ల‌


9 months ago వేడుక‌గా ‘ఎఫ్ 2’ఆడియో విడుద‌ల‌

హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను విశాఖపట్టణంలో జ‌రుగుతున్న‌ విశాఖ ఉత్సవ్ లో ఘ‌నంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించారు.

అనంతరం ఆయ‌న మాట్లాడుతూ,  ఈ ఉత్సవం విశాఖకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లోనే అందమైన‌ నగరం విశాఖపట్టణమని, ఏ ప్రముఖుడు ఇక్కడికి వచ్చినా విశాఖ‌ గొప్పతనం గురించి ప్రస్తావించకుండా వెళ్ల‌డ‌ని అన్నారు. అటువంటి విశాఖకు సినీ ఇండస్ట్రీ తరలి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. వైజాగ్ లో ఉన్న తమ స్టూడియోలో చిత్ర నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా చూస్తామని వెంకటేష్ తనకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా ఎఫ్ 2 చిత్రంలో రెచ్చిపోయేలా తనతో నటింపజేశాడని ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని హీరో వెంకటేష్ ప్రశంసించారు. వైజాగ్ తన మొదటి సినిమా కలియుగ పాండవుల నుంచి చాలా సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగిన విషయాన్ని వెంక‌టేష్ గుర్తుచేసుకున్నారు. ఇదే బీచ్ లో కత్రినా కైఫ్ తో నడిచానంటూ ‘మళ్లీశ్వరి’ చిత్రాన్ని వెంకటేష్ గుర్తుచేసుకున్నారు.