సినిమా వార్తలు

మాస్టర్ తనీష్ నుంచి బిగ్‌బాస్ తనీష్ వరకూ


10 months ago మాస్టర్ తనీష్ నుంచి బిగ్‌బాస్ తనీష్ వరకూ

‘దేవుళ్లు’, ‘మన్మధుడు’ లాంటి సూపర్ హిట్ సినిమాలలో బాల నటునిగా కనిపించిన మాస్టర్ ‘తనీష్’.. 2008లో ‘నచ్చావులే’ సినిమాతో మిస్టర్ తనిష్ గా తెలగు ప్రేక్షకులను అలరించారు. తనీష్ తండ్రి ఏసువర్థన్ సైన్యంలో సుబేదారుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇటీవలే ఆయన కన్నుమూశారు. తల్లి సరస్వతి గృహిణి. తనీష్ కు ఇద్దరు సోదరులు వంశీకృష్ణ, కాశీ విశ్వనాథ్. ‘దేవుళ్లు’ సినిమాలో అయ్యప్ప స్వామిగా నటించిన తనీష్ అంత చిన్నవయసులోనే ప్రేక్షకుల అమితమైన అభిమానాన్ని చూరగొన్నారు. తరువాత ‘మన్మధుడు’లో హీరోయిన్ సోనాలీబింద్రే సోదరునిగా తెరపై హాస్యాన్ని పండించాడు.

అనంతరం ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా మారిపోయాడు. ఈ సినిమాలో తనీష్ సరసన మాధవీలత నటించింది.  తరువాత ‘రైడ్’, ‘మౌనరాగం’, ‘ఏం పిల్లో ఏం పిల్లడో’, ‘కోడిపుంజు’, ‘మంచివాడు’, ‘మేం వయసుకు వచ్చాం’... ఇలా పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. తెలుగు తెరపై భారీ తారాగణంతో వచ్చిన ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలోనూ నటించారు. ప్రస్తుతం తనీష్ తన సినీ కెరియర్ లో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తయితే తనీష్ కు ‘బిగ్ బాస్’ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. తనీష్ నటించిన ‘రంగు’ సినిమా ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. తనీష్ మరిన్ని సినిమాల్లో నటించి మంచిపేరు తెచ్చుకోవాలని కోరుకుందాం.