సినిమా వార్తలు

మహేష్ పేరులోనే కాదు సినిమాల్లోనూ వైబ్రేషన్


11 months ago మహేష్ పేరులోనే కాదు సినిమాల్లోనూ వైబ్రేషన్

టాలీవుడ్ అందగాడు, ప్రిన్స్ మహేష్ అప్పుడే తన 39 ఏళ్ల సినీ కెరియర్ పూర్తిచేశారు. ఇది నమ్మలేనట్టు అనిపించినా నిజం. ప్రతీ చిత్రంలో కొత్తదనం చూపించే ఆయన అంతకంతకూ అభిమానులను కూడా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం తన 25 వ సినిమా ‘మహర్షి’ చేస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్ లో మైలురాయిలా నిలిచిపోయేందుకు ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగష్టు 9, 1975 లో కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు చెన్నైలో జన్మించిన మహేష్ దర్శకుడు దాసరి నారాయణ రావు రూపొందించిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు.

మహేష్ బాబు ఒకవైపు చదువుకుంటూనే తన సెలవు రోజుల్లో సినిమాలు చేస్తూవచ్చారు. బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించారు. 1989 లో కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసారు. తరువాత నటనకు కొంతకాలం గ్యాప్ తీసుకున్నారు. తరువాత నటనలో మెరుగులు దిద్దుకుని రాజకుమారుడు చిత్రంతో హీరోగా తిరిగి రంగప్రవేశం చేశారు. హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తో వంశీ సినిమాలో నటించారు. ఈ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి వారు వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. కుమారుడు గౌతమ్ కృష్ణ. కుమార్తె సితార. వీరు కూడా సినీరంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

మహేష్ తన జీవితంలో పలు హిట్ లను, ప్లాప్ లను చవిచూశారు. ప్రస్తుతం ఆయన తన సిల్వర్ జూబ్లీ సినిమా ‘మహర్షి’తో బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా మహేష్ సమాజ సేవలోనూ ముందుంటారు. ఆయన బుర్రిపాలెం, సిద్ధాపురం అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ అభివృద్ది పనులు చేపడుతున్నారు. మహేష్ బాబు తన కెరియర్ లో 5 నంది అవార్డులు,5 ఫిలిం ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.