సినిమా వార్తలు

సంచలనాలకు సిద్ధమైన 'ఆపరేషన్ 2019’


8 months ago సంచలనాలకు సిద్ధమైన 'ఆపరేషన్ 2019’

తన విభిన్నమైన నటనతో అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీకాంత్ తన 125 చిత్రం ‘ఆపరేషన్‌ 2019’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘ఆపరేషన్‌ 2019’చిత్రం డిసెంబరు 1న విడుదల కానున్న సందర్బంగా హీరో శ్రీకాంత్  ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... 

‘ఆపరేషన్‌ 2019’ నా 125వ చిత్రం. ‘ఆపరేషన్‌ దుర్యోధన’ చిత్రం తరహాలోనే ఈ ‘ఆపరేషన్‌ 2019’ కూడా పొలిటికల్‌ సెటైర్‌గా ఉంటుంది. ఏ పార్టీనో విమర్శించాలని చేసింది. కాదు. నాయకులు, ప్రజలకు కనెక్ట్‌ అయ్యే పాయింట్స్‌ ఉన్నాయి. ఓటు విలువని కూడా చూపించాం. పదునైన డైలాగ్స్‌ ఉన్నాయి. పాత్ర బావుంటే ఏ సినిమా అయినా ఓకే. మల్టీస్టారర్‌ సినిమాలు, విలన్‌ పాత్రలూ చేస్తాను. కేవలం హీరోగానే సినిమాలు చేయాలనుకోవడం లేదు. కానీ, లైఫ్‌ లాంగ్‌ సినిమాలు చేస్తూనే ఉంటాను’అని శ్రీకాంత్‌ అన్నారు. ఆయన హీరోగా కరణం బాబ్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆపరేషన్‌ 2019’. మంచు మనోజ్, సునీల్‌ కీలక పాత్రలు చేశారు. 

కథ ఇదే...

రైతు కుటుంబంలో పుట్టి విదేశాలు వెళ్లి తిరిగొచ్చిన కథానాయకుడు సొంత రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో రాజకీయ నాయకుడిగా ఎలా మారాడు? తను అనుకున్నది సాధించాడా? లేదా? అన్నదే చిత్రకథాంశం. ఇందులో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర చేశాను. మంచు మనోజ్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించగా, సునీల్‌ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపిస్తారు. 

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని...

2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ చిత్రం ప్రారంభించాం. అయితే ఈ లోపునే ఎలక్షన్స్‌ ముందుగా వచ్చాయి. అందుకే త్వరగా రిలీజ్‌ చేస్తున్నాం. నేను, బాబ్జీ కలిసి ‘మెంటల్‌ పోలీస్‌’ సినిమా చేశాం. అతని స్టైల్‌ నాకెంతో నచ్చింది. అందుకే మళ్లీ పని చేశాం. సినిమాలు సొసైటీని మారుస్తాయి అని అనుకోకూడదు. కానీ, వాటి ప్రభావం మాత్రం తప్పక ఉంటుంది.   

రజినీకి పోటీకాదు.. ఆయన పెద్ద కాంత్.. నేను చిన్న కాంత్

రజినీకాంత్‌గారి ‘2.0’కి పోటీగా వస్తున్నా అంటున్నారు. ఆయనతో పోటీ ఏముంటుంది? ఆయన పెద్ద కాంత్, నేను చిన్న కాంత్‌ (నవ్వుతూ). ఏ సినిమా బాగుంటే ఆ థియేటర్స్‌కి ప్రేక్షకులు వస్తారు. ప్రతి సినిమా హిట్‌ అవ్వాలనే చేస్తాం. కొన్ని ప్రేక్షకులను అలరించవు.. బాధగా ఉంటుం ది. ‘యుద్ధం శరణం’ సినిమాలో విలన్‌గా నటించా. అది సూపర్‌ హిట్‌ అయ్యుంటే విలన్‌గా బిజీ అయిపోయేవాడినేమో?.

మా రోహన్ ఏం చేస్తున్నాడంటే...

చిన్న అబ్బాయి రోహన్‌ ప్రభుదేవాగారితో ఓ సినిమా చేస్తున్నాడు. పెద్దబ్బాయి రోషన్‌ని వచ్చే ఏడాది లాంచ్‌ చేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం నేను ‘తెలంగాణ దేవుడు, మార్షల్‌’ అనే సినిమాల్లో నటిస్తున్నాను