సినిమా వార్తలు

సోనాలీ బాధ వ‌ర్ణ‌నాతీతం!


11 months ago సోనాలీ బాధ వ‌ర్ణ‌నాతీతం!

బాలీవుడ్‌ కథానాయిక సోనాలి బింద్రే కేన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న‌ విషయం తెలిసిందే. అక్క‌డ ఆమె చాలా ధైర్యంగా ఉంటూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్‌ తెలిపారు. అయితే ఆమె ఎదుర్కొంటున్న చికిత్సా విధానం.. తను నొప్పిని భరిస్తున్న తీరును ట్విట్టర్ ద్వారా అభిమానులతో సోనాలి పంచుకున్నారు. ‘గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయాను. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి కూడా శక్తిలేక బాధపడ్డాను. శారీరకంగా ప్రారంభమైన ఈ పెయిన్‌.. మానసికంగా, ఎమోషనల్‌గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. కొన్నిసార్లు కేన్సర్‌ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా. ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.

ఆ నొప్పిని భరిస్తూ ఏడ్చా. మనకేం అవుతోందో, ఎటువైపు వెళ్తున్నామో కేవలం మనకు మాత్రమే తెలుస్తుంది. దాన్ని అంగీకరించడమే మంచిది. భావోద్వేగానికి గురి కావడం తప్పేం కాదు. నెగిటివ్‌ ఎమోషన్స్‌ను ఫీల్‌ అవడం కూడా తప్పు కాదు. కానీ, ఆ తర్వాత వాటిని గుర్తించాలి. మీ జీవితంలో దాని ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఈ జోన్‌ నుంచి బయటికి రావడానికి చాలా స్వీయ జాగ్రత్త ఎంతో అవసరం. ఇలాంటి ఆలోచనలు రాకుండా చేయడంలో నిద్ర చాలా సహాయపడుతుంది. లేదా నా కుమారుడితో మాట్లాడుతూ ఉంటే చెడు ఆలోచనలు రావు. ఇప్పుడు నా చికిత్స కొనసాగుతోంది.. నా రూపు కాస్త చక్కగా మారింది. త్వరలో ఇంటికి వచ్చేస్తాను" అని సోనాలి తను బాధపడుతున్న విధానాన్ని తెలియజేసింది. అలాంటి చెడు రోజులు జీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురవుతాయని.. వాటిని ఎదుర్కొని సంతోషంగా ఉండాలని సోనాలీ సలహా ఇచ్చారు.