సినిమా వార్తలు

‘శైలజారెడ్డి అల్లుడు’ ‘యూటర్న్’తీసుకుంటే?


11 months ago ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘యూటర్న్’తీసుకుంటే?

సమంత నటించిన‘యూటర్న్’ సినిమా వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల అవుతుందని ముందుగానే ప్రకటించారు. ఆ తర్వాత ఇదే తేదీకి సమంత భర్త నాగచైతన్య పోటీలో దిగారు. కొంతకాలం క్రితమే విడుదల కావాల్సిన ‘శైలజారెడ్డి అల్లుడు’ వాయిదాల అనంతరం సెప్టెంబరు 13నే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకవైపు భార్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా, మరోవైపు భర్త హీరోగా నటించిన సినిమా. వీరి మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొంది. ‘యూటర్న్’ ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్ల రూపాయల స్థాయిలో ఉండగా, ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 24 కోట్ల రూపాయలు అని సినీవర్గాలు చెబుతున్నాయి.

మొత్తంగా నలభై కోట్ల రూపాయల వ్యవహారం నడుస్తోంది. అటు సమంతకూ, ఇటు నాగచైతన్యకూ ఈ సినిమాలు వసూళ్ల పరంగా ప్రిస్టేజ్ ఇష్యూగా మారేలా కనిపిస్తోంది. సమంత సోలోగా 16 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్‌కు లాభాలను పండించే స్థాయిలో వసూళ్లను సాధించిన పక్షంలో బాక్సాఫీస్ వద్ద ఆమె స్టామినా ఏమిటో స్పష్టం అందరికీ అర్థం అవుతుంది. ఇక చైతూ సినిమాలకు కూడా పాతిక కోట్ల రూపాయల స్థాయి వ్యాపారం అతనికి కొత్త ఛాలెంజ్ అంటున్నారు.  ఈ విధంగా భార్యభర్తల సినిమా పోరులో ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాల్సిందే.