సినిమా వార్తలు

డైల‌మాలో రాజశేఖర్ కుమార్తె సినిమా?


7 months ago డైల‌మాలో రాజశేఖర్ కుమార్తె సినిమా?

చిత్ర పరిశ్రమలో వారసులదే హవా కొన‌సాగుతుంటుంది. ఈ కోవలోనే హీరోయిన్ గా పరిచయంకానున్న‌ రాజశేఖర్ కుమార్తె సినిమా డైల‌మాలో పడిందట.  రాజశేఖర్-జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని. ‘2 స్టేట్స్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. చేతన్ భగత్ ర‌చ‌న‌ ‘2 స్టేట్స్’ నవల హిందీలో సినిమాగా రూపొంది భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని.. అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తుండగా శివాని హీరోయిన్‌గా పరిచయమవుతోంది. నూతన దర్శకుడు వెంకట్‌ రెడ్డి దర్శకత్వంలో ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయినట్టు టాలీవుడ్ లో ప్రచారం సాగుతోంది.

ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో, ఎడిటర్ నవీన్ నూలీ, ఇద్దరు కో డైరెక్టర్స్.. ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ దర్శకుడితో భేదాభిప్రాయాలు వచ్చి.. సినిమా నుంచి వాకౌట్ చేసినట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే చిత్ర బృందం వెర్షన్ మరోలా ఉంది. తమ సినిమా హైదరాబాద్, కోల్‌కతాలలో ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తిచేసుకుందని, త్వరలో అమెరికాలో మరో షెడ్యూల్ జరపబోతున్నట్టు తెలిపారు. యూనిట్‌కి అమెరికా వీసాలు రావడం లేటవ‌డం కార‌ణంగా సినిమా ఆగిపోయిందనే రూమర్స్ ప్రచారమవుతున్నాయని చిత్ర బృందం అంటోంది. త్వరలోనే అమెరికా షెడ్యూల్ పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేయబోతున్నట్టు తెలిపింది.