సినిమా వార్తలు

విడుదలకు 'మిస్టర్ మజ్ను' ఇబ్బందులు?


1 year ago విడుదలకు 'మిస్టర్ మజ్ను' ఇబ్బందులు?

అక్కినేని అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను' చిత్రం రూపొందుతున్న విషయం విదితమే. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, చాలావరకూ విదేశాల్లోనే షూటింగు జరుపుకుంది. గతంలో అఖిల్ చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో ఈ సారి పోటీ లేకుండా సోలోగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని అఖిల్ తండ్రి నాగార్జున భావించారట. అందులో భాగంగానే ఈ సినిమాను సంక్రాంతికి కాకుండా, రిపబ్లిక్ డే నాడు, అంటే జనవరి 26వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.  అయితే ఇప్పుడు 'ఎన్టీఆర్ మహానాయకుడు' కారణంగా అఖిల్ మూవీ ఇబ్బందుల్లో పడిందని సమాచారం. 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను జనవరి 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్న ఈ సినిమా టీమ్, తరువాత భాగాన్ని 'ఎన్టీఆర్ మహానాయకుడు' పేరుతో జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పింది. ఎన్టీఆర్ బయోపిక్ కి గల క్రేజ్ గురించి తెలియడం వలన ఆలోచనలోపడిన 'మిస్టర్ మజ్ను' టీమ్, ఏ నిర్ణయం తీసుకుంటుందో వెల్లడికావాల్సివుంది.  ఇదిలావుండగా  ‘మిస్టర్ మజ్ను’ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను సెప్టెంబర్ 19న విడుదల చేశారు. ‘తొలి ప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర  ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ 3 మిలియన్స్ పైగా వ్యూస్ సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వ్యూస్ సంబంధించిన పోస్టర్‌ని విడుదల చేసింది. ఇంతగా ఆదరిస్తున్నందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ తెలిపింది.