సినిమా వార్తలు

మళ్లీ తెరపైకి పవర్‌స్టార్?... అభిమానులకు పండుగే?


8 months ago మళ్లీ తెరపైకి పవర్‌స్టార్?... అభిమానులకు పండుగే?

అజ్ఞాత‌వాసి ఫ్లాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పట్లో సినిమాల్లో నటించను.. రాజకీయ రంగంపైనే దృష్టిపెడతానని కూడా స్పష్టం చేశారు. పవన్ చెప్పిన మాట ప్రకారం జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజల సాధకబాధకాలు తెలుసుకొంటున్నారు. కాగా తాజాగా పవన్ కల్యాణ్ ఓ సినిమాలో నటించనున్నారనే వార్త ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలో సినీ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన సినీ ప్రవేశం కోసం నటన, తదితర విభాగాల్లో శిక్షణ తీసుకొంటున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాలను రూపొందించిన డాలీ (కిషోర్ కుమార్ పార్దసాని) దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. గోపాల గోపాల, కాటమరాయుడు చిత్రాల నిర్మాణ సమయంలో డాలీ, పవన్ కల్యాణ్ మధ్య మంచి రిలేషన్స్ ఏర్పడ్డాయి. మేనల్లుడితో రూపొందించే చిత్రంలో  పవన్ ను ఓ కీలక పాత్రలో నటించమని డాలీ చేసిన రిక్వెస్ట్‌ చేశారట. దానికి పవర్ స్టార్ ఓకే అన్నట్టు వార్తలు వినపడుతున్నాయి. మేనల్లుడి కోసం కీలకమైన, అతిథి పాత్రను చేయడానికి సిద్ధపడినట్టు పవన్ సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియకపోయినా, అభిమానులకు పండుగలాంటి వార్తగా మారింది. గతంలో అజ్ఞాత‌వాసి తర్వాత పవన్ కల్యాణ్ రెండు చిత్రాలు చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. మైత్రీ మూవీస్ బ్యానర్‌, నిర్మాత ఏఎం రత్నం బ్యానర్లో సినిమాలు చేయాల్సి ఉండేది. కానీ రాజకీయపరమైన నిర్ణయం కారణంగా వాటి నుంచి తప్పుకొన్నట్టు సమాచారం. అయితే తాజాగా డాలీ సినిమాలో నటిస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.