సినిమా వార్తలు

‘నోటా’లో రాజకీయ ప్రముఖులు?


1 year ago ‘నోటా’లో రాజకీయ ప్రముఖులు?

స‌మ‌కాలీన రాజ‌కీయాల్ని స‌మ‌ర్థంగా తెర‌కెక్కించ‌గ‌లిగితే పొలిటిక‌ల్‌ డ్రామా కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ కోవ‌లోనే వ‌స్తున్న సినిమా `నోటా`. ట్రైల‌ర్లు, పోస్ట‌ర్లు చూస్తే ఈ సినిమా మొత్తం రాజ‌కీయాల చుట్టూనే తిరుగుతుంద‌న్న విష‌యం తెలుస్తోంది.  ద‌క్షిణాది రాజ‌కీయాల ముఖ‌చిత్రాన్ని నోటాలో ఆవిష్క‌రించేశార‌ని సమాచారం‌. త‌మిళ రాజ‌కీయాలే కాదు, ప్ర‌స్తుతం న‌డుస్తున్న ఆంధ్ర‌, తెలంగాణ రాజ‌కీయాల్ని కూడా ఈ సినిమాలో చూడొచ్చ‌ని తెలుస్తోంది. రాష్ట్రం విడిపోతున్నప్ప‌టి ప‌రిస్థితుల్ని, ఆ త‌ర‌వాత జ‌రిగే ప‌రిణామాల్ని కూడా ఇందులో చూచాయిగా చూపించార‌ని అంటున్నారు.

అంతేకాదు.. కేసీఆర్‌, కేటీఆర్‌ల‌ను పోలిన పాత్ర‌లు ఈ సినిమాలో చూడ‌చ్చ‌ని, వాళ్ల‌ని సైతం పాజిటీవ్ యాంగిల్‌లోనే చూపించార‌ని అంటున్నారు. జ‌య‌ల‌లిత ఎపిసోడ్ కూడా ఈ సినిమాలో ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. జ‌య‌ల‌లిత ఆసుపత్రిలోనే క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆసుప‌త్రి ఎపిసోడ్‌ని గుర్తు చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయట‌. క‌ర్నాట‌క‌, కేర‌ళ రాజకీయాలను కూడా ఇందులో ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. మరి వీటిలోని నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.