సినిమా వార్తలు

‘అరవింద సమేత’లో ‘పవన్ సీన్లు’?


1 year ago ‘అరవింద సమేత’లో ‘పవన్ సీన్లు’?

రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో తెలుగులో చాలా సినిమాలొచ్చాయి. క‌థ మొత్తం రాయ‌ల‌సీమ నేప‌థ్యంలోనే జరిగేది. కాక‌పోతే.. రాయ‌ల‌సీమ‌లోని అస‌లైన మాండలీకాన్ని  ఎవ్వ‌రూ ప‌ట్టుకోలేద‌నే చెబుతుంటారు. మ‌నం ఇప్పుడు సినిమాల్లో వింటున్న మాండ‌లికం 10 శాతం మాత్ర‌మే. రాయ‌ల‌సీమ మాండ‌లికాన్ని ఉన్న‌ది ఉన్న‌ట్టు వాడితే చాలామ‌ట్టుకు ఈత‌రానికి అర్థం కావు. అయితే ఇప్పుడు త్రివిక్ర‌మ్ మాత్రం రాయ‌ల‌సీమ మాండ‌లికాన్ని పూర్తి స్థాయిలో చూపించ‌డానికి సిద్ధ‌మవుతున్నారు.

`అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌` రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే సినిమా. రాయ‌ల‌సీమ ఎపిసోడ్‌కి ఈ చిత్రంలో చాలా ప్రాధాన్యం ఉంది. రాయ‌ల‌సీమ‌లో కనిపించే ప్ర‌తీ పాత్రా అచ్చ‌మైన రాయ‌ల‌సీమ మాండ‌లిక‌మే మాట్లాడుతుంది. ఈ మాండ‌లికంలో డైలాగులు రాయ‌డం త్రివిక్ర‌మ్‌కి కొత్త‌. కాక‌పోతే ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో `కోబ‌లి` సినిమా  చేయాలనుకున్నప్పుడు రాయ‌ల‌సీమ మాండ‌లికంపై చాలా క‌స‌రత్తు చేశారు. అదంతా ఇప్పుడు `అర‌వింద‌`కు బాగా ఉప‌యోగ‌ప‌డుతోంది. సీమ‌లో ఫ్యాక్ష‌నిజం ఎలా పుట్టింది? ఆ రోజుల్లో ప్ర‌త్య‌ర్థిపై దాడులు ఎలా జ‌రిగేవి? అనే విష‌యంలో త్రివిక్ర‌మ్ చాలా ఆస‌క్తిక‌ర‌మైన సమాచారాన్ని సేక‌రించారట. అలాంటి స‌న్నివేశాల‌న్నీ `కోబ‌లి`లో పొందుప‌ర‌చాల‌నుకున్నారు. `కోబ‌లి` సినిమాని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టేయ‌డంతో ఆ సీన్లు `అర‌వింద‌`లో వాడిన‌ట్టు సమాచారం. ‘కోబలి’ గురించిన విషయాలను త్రివిక్రమ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘పవన్ కల్యాణ్‌తో ‘కోబలి’ చిత్రం చేయాలనుకున్న మాట నిజమే. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంతో కథ కూడా రెడీ చేశాం.

సీమలో శత్రువులపై పోరాటానికి వెళ్లినప్పుడు కసిగా ‘కోరు బలి - నరుకు బలి’ అని గట్టిగా అరుస్తారు. అందుకే ఆ సినిమాకి ‘కోబలి’ అనే టైటిల్ అనుకున్నాం.  అయితే 2014 ఎన్నికల కోసమని యేడాది పాటు సినిమాలు చేయనని పవన్ కల్యాణ్ చెప్పడంతో ఆ సినిమా అక్కడే ఆగిపోయింది. అయితే ఆ సినిమా కోసం అప్పట్లో చాలా రీసెర్చ్ చేసి.. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ఆ అనుభవం ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న సినిమాకి ఉపయోగపడిందని త్రివిక్రమ్ వెల్లడించారు.