సినిమా వార్తలు

ఎన్టీఆర్... లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వెనుక...


11 months ago ఎన్టీఆర్... లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం వెనుక...

ఎంతో మంది అందగత్తెలతో కలసి నటించిన ఎన్టీఆర్ కు, ఈవిడ ఎక్కడ దొరికిందా? అన్న నెగటివ్ ఇంప్రెషన్ తో మొదలైన తన ఆలోచన, చివరకు ఆమెపై పాజిటివ్ దృక్పథాన్ని వచ్చేలా చేసిందని, ఆయన జీవితంలోని కొన్ని నిజాలను చూపించడమే లక్ష్యంగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ను రూపొందిస్తున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అందగత్తెలను ఎవరినీ పెళ్లి చేసుకోని ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకోవడం ఏమిటని తనకు అనిపించేదని ఆయన అన్నారు. ఓ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ, "రామారావును అద్భుతమైన మేధస్సు కలిగిన వ్యక్తని ప్రతి ఒక్కరూ పొగుతుతారు. రాజకీయ వ్యవస్థనే మార్చేసిన వ్యక్తని అంటారు. విధానపరమైన నిర్ణయాల్లోనూ ఆయనకు ఆయనే సాటి. అయితే లక్ష్మీ పార్వతి ప్రస్తావన వచ్చినప్పుడల్లా 'ఈ ఒక్క విషయంలో మాత్రం...' అంటుంటారు. ఈ ఒక్క విషయం అంటే?... ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచించి, ఈ సినిమాను మొదలు పెట్టా" అని అన్నారు.

ఈ సినిమా కోసం, ఎన్టీఆర్ తో కలసి పనిచేసిన అధికారులు, ఆయనతో పరిచయం ఉన్న వారితో మాట్లాడానని చెప్పారు. ఎన్టీఆర్ చనిపోవడానికి వారం రోజుల ముందు ఇచ్చిన ఇంటర్వ్యూను చూశానని, ఆ వీడియోలో లక్ష్మీ పార్వతి గురించి ఆయన గౌరవం, అభిమానాలతో మాట్లాడారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరిగాయని, అవి ఆయన జీవితాన్నే మార్చేశాయని వర్మ పేర్కొన్నారు.