సినిమా వార్తలు

మా నాన్న అలాంటివారు కాదు: ఐశ్వర్య


9 months ago మా నాన్న అలాంటివారు కాదు: ఐశ్వర్య

తన తండ్రి అర్జున్‌పై ఆరోపణలు చేసిన నటి శృతి హరహరణ్‌పై సీనియర్ హీరో అర్జున్‌ కుమార్తె ఐశ్వర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నిబునన్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో అర్జున్‌ తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించారని నటి శృతి ఇటీవల ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. శృతి చేస్తున్న ఆరోపణలపై అర్జున్‌ కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఐశ్వర్య తన తండ్రిపై వస్తున్న ఆరోపణల గురించి మీడియా ద్వారా స్పందించారు. ‘తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్‌లను నాన్న మమ్మల్ని కూడా వినమంటారు.

‘నిబునన్’ సినిమా స్క్రిప్ట్‌లో ఒకటి రెండు చోట్ల ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు నాన్న వాటిని తొలగిస్తే కానీ సినిమా చేయనని చెప్పారు. మరి ఆ సమయంలో శృతి ఎందుకు మాట్లాడలేదు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం శృతి కేవలం ఐదు రోజులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొన్నారు. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి రెండు రోజులు చాలు. చిత్రీకరణలో పాల్గొన్న ఐదు రోజుల్లో మా నాన్న కారణంగా ఇబ్బంది కలిగిందని, రిహార్సల్స్‌ నిమిత్తం సెట్స్‌కు రానని ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో శృతి చెప్పారు. అలాంటప్పుడు ఆమెను రిసార్ట్‌కి రమ్మని, డిన్నర్‌కు రమ్మని పిలవడానికి మా నాన్నకు సమయం ఎక్కడుంది? ఇన్నేళ్ల జీవితంలో మా నాన్న పబ్‌కు వెళ్లడం నేనెప్పుడూ చూడలేదు.

అలాంటిది ఆమెను రిసార్ట్‌కు రమ్మంటారా? ఒక వ్యక్తికి ఇష్టంలేకుండా అతని పట్ల దురుసుగా కానీ అసభ్యకరంగా కానీ ప్రవర్తిస్తే దానిని ‘మీటూ’ అంటారు. శృతి చేస్తున్న ఆరోపణల్లో నాకు ఆ విషయం ఎక్కడా కనిపించడంలేదు. ఆమె సొంత లాభాల కోసం ఇలా చేస్తున్నారు. అందువల్లే కదా ఆమె పేరు అన్ని ఛానళ్లలో మారుమోగుతోంది. కానీ నేను మాత్రం ఆమెలా ఆలోచించలేను.’ అని ఐశ్వర్య పేర్కొన్నారు.