సినిమా వార్తలు

నాని టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్


3 months ago నాని టైటిల్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్

మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి కొత్తగా చెప్పాల్సిన దేమీలేదు. వారు చిరు సినిమా పోస్టర్‌పైన ఈగ వాలినా ఊరుకోరు. అలాంటిది ఆయన ఎవర్‌గ్రీన్ సినిమాలు, వాటి టైటిళ్లు, పాటలను ఎవరైనా టచ్ చేస్తే ఇక ఊరుకునే ప్రశ్నేలేదు. చివరికి మెగాస్టార్ పాటలను ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రీమిక్స్ చేస్తేనే ఊరుకోలేదు. ఇంకోసారి ఇలా చిరు పాటలను వాడుకుంటే ఊరుకునేది లేదని సోషల్ మీడియాలో  వార్నింగులు ఇచ్చేశారు. ఇప్పుడు  మెగా అభిమానులు నేచురల్ స్టార్ నానికి వార్నింగులు ఇవ్వడం ప్రారంభించారు. దీనికి కారణం ఆయన కొత్త సినిమాకు చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ పేరును వాడుకున్నారు.  విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తోన్న సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్‌ను పెట్టిన సంగతి తెలిసిందే. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. దీనిని చూసిన మెగా ఫ్యాన్స్‌కు పౌరుషం తన్నుకొచ్చింది. మెగాస్టార్ సినిమా టైటిల్‌ను నువ్వెలా వాడతావ్ అంటూ నానిపై ఫైర్ అవుతున్నారు. దీనికితోడు ‘బాయ్‌కాట్ నానీస్ గ్యాంగ్‌లీడర్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ట్రోలింగ్ ప్రారంభించారు.

ఇది మెగాస్టార్‌ మాత్రమే వాడుకునే టైటిల్ అని ఇంకెవ్వరూ వాడటానికి వీళ్లేదని తెగేసి చెబుతున్నారు. ఎంత ధైర్యముంటే మెగాస్టార్ టైటిల్‌ను టచ్ చేస్తావంటూ నానిపై చిందులు తొక్కుతున్నారు. కొంతమంది ‘నాని సార్ దయచేసి టైటిల్ మార్చుకోండి’ అంటూ అడుగుతున్నారు.  ఈ టైటిల్‌తో రామ్ చరణ్ సినిమా తీస్తే బాగుంటుందని మెగాఫ్యాన్స్ ఆశించారు. ఒకానొక దశలో ‘వినయ విధేయ రామ’ సినిమాకి ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టాలని కూడా భావించారట. అయితే రామ్ చరణ్ ఒప్పుకోకపోవడంతో ఆ ఆలోచన విరమించుకున్నారని తెలుస్తోంది.  మరి ఈ టైటిల్‌ విషయంలో నాని ఏవిధంగా స్పందిస్తారో వేచిచూడాలి.