సినిమా వార్తలు

నాగ్ మన్మధుడుపై చైతూ క్లారిటీ


6 months ago నాగ్ మన్మధుడుపై చైతూ క్లారిటీ

నాగార్జున నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మన్మధుడు’ఒకటి. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రచయితగా వ్యవహరించారు. నాగార్జున నటించిన చిత్రాల్లో మన్మధుడు చిత్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ విషయాన్ని గతంలో నాగార్జున చెప్పారుకూడా. ఆ చిత్రంతో నాగార్జునకు మన్మధుడు అనే స్థిరపడిపోయింది. అంతటి ప్రత్యేక గుర్తింపును - సక్సెస్ ను తెచ్చి పెట్టిన సినిమాలను ఏ హీరో కూడా అంత సులభంగా మర్చిపోలేరు. నాగార్జున కూడా ‘మన్మధుడు’ సినిమాపై ప్రత్యేక శ్రద్దతో ఆ చిత్రం సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తోడుగా అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో ‘మన్మధుడు 2’ అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించడం జరిగింది అంటూ వార్తలు వచ్చాయి.

దాంతో త్రివిక్రమ్ దర్శకత్వంలో చైతూ లేదా అఖిల్ లతో నాగార్జున ‘మన్మధుడు 2’ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. తాజాగా నాగచైతన్య ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘మన్మధుడు’ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో సీక్వెల్ అంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని వివరించారు. అయితే ‘మన్మధుడు 2’ చిత్రం మాత్రం నిజమే అని తెలిపారు. ‘చి.ల.సౌ’ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నారని సమాచారం. ఆ చిత్రం కాస్త అటు ఇటుగా మన్మధుడు చిత్రంను పోలి ఉంటుందట. దానికి తోడు రాహుల్ సిద్దం చేసుకున్న కథకు ‘మన్మధుడు’ టైటిల్ బాగా సూట్ అవుతుందని టాక్. అందుకే మన్మధుడు 2 టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించినట్లుగా నాగచైతన్య మాటల ద్వారా అవగతమవుతోంది.