సినిమా వార్తలు

‘మా’ వివాదానికి తెర


11 months ago ‘మా’ వివాదానికి తెర

నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) రెండుగా చీలిపోయిన విషయం విదితమే. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, సెక్రటరీ నరేష్ (సీనియర్)లు రెండు వర్గాలుగా చీలిపోయి, ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, సినీ పెద్దలు రంగంలోకి దిగి, పరిస్థితిని చక్కదిద్దారు. ఆ రెండు వర్గాలను తిరిగి ఏకం చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, ప్రతి సంస్థలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని అన్నారు. రెండు వర్గాలు ప్రెస్ మీట్ పెట్టి తప్పు చేశాయని అన్నారు. ఇకపై అన్ని విషయాలను కలెక్టివ్ కమిటీనే చూసుకుంటుందని తేల్చిచెప్పారు. 'మా'లో ఎలాంటి అవకతవకలు జరగలేదని సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కలెక్టివ్ కమిటీ విచారణలో తేలిందన్నారు. భవిష్యత్తులో మీడియాతో కలెక్టివ్ కమిటీనే మాట్లాడుతుందని చెప్పారు. ఈ సందర్బంగా శివాజీరాజా మాట్లాడుతూ, చిన్న మనస్పర్థలు వచ్చిన మాట నిజమేనని, అన్ని వివరాలను కలెక్టివ్ కమిటీ ముందు ఉంచామన్నారు, దీంతో ఎలాంటి అవకతవకలు జరగలేదని తేలిందని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ, ఏ సంస్థలోనైనా భేదాభిప్రాయాలు రావడం సహజమేనని, రాబోయే రోజుల్లో జరిగే ఈవెంట్స్ ని కలసికట్టుగా విజయవంతం  చేస్తామన్నారు.