సినిమా వార్తలు

ప్రభాస్‌ సినిమాకు విదేశీ టైటిల్?


1 year ago ప్రభాస్‌ సినిమాకు విదేశీ టైటిల్?

‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయంగా ఖ్యాతి దక్కించుకున్న ప్రభాస్ ‘సాహో’ సినిమా సెట్స్‌పై ఉండగానే తన తదుపరి సినిమా చిత్రీకరణను మొదలుపెట్టేశారు‌. రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం తాను సెట్స్‌లో జాయిన్‌ అయ్యానంటూ పూజా సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోలు షేర్ చేశారు. అప్పటికే వర్కింగ్‌ టైటిల్‌ను కూడా అనేసుకున్నారు. కానీ పూజా వర్కింగ్‌ టైటిల్‌ కనిపించకుండా వేలు అడ్డుపెట్టేశారు. ఈ సినిమాకు ఆసక్తికరంగా ఫ్రెంచ్‌ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. ‘అమూర్‌’ (ఫ్రెంచ్‌లో ప్రేమ అని అర్థం) అనే టైటిల్‌ను అనుకుంటున్నారని ఫిలిం వర్గాలు చెబుతున్నాయి. అదీ కాకుండా ఈ సినిమాను ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. ఈ సినిమా కోసం రాధాకృష్ణ పీరియాడికల్‌ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇది 1970 నేపథ్యంలో సాగే ప్రేమకథని అంటున్నారు. కథ ప్రకారం యూరప్‌లోనే ఎక్కువ భాగం తెరకెక్కిస్తారట. కాస్త ఫాంటసీ, థ్రిల్లింగ్‌, యాక్షన్‌ కూడా జోడించారట. ఈ సినిమా కోసం చిత్ర బృందం కొత్త తరహా సెట్లు నిర్మించే పనిలో ఉంది. కళా దర్శకుడు, ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని సెట్లు తీర్చిదిద్దే పనిలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్‌ ‘సాహో’ సినిమాతో బిజీగా ఉన్నారు. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. దాదాపు బాలీవుడ్‌కు చెందిన అగ్ర నటులంతా ఈ చిత్రంలో కన్పించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ సన్నివేశాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం.