సినిమా వార్తలు

వర్మను ఇలా చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే


11 months ago వర్మను ఇలా చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

సాంప్రదాయ వస్త్రధారణలో రామ్ గోపాల్ వర్మ... నుదుటన బొట్టు, చేతిలో తిరుమల లడ్డు, భుజాన కండువా... !! ఇలా వర్మను ఏరోజైనా చూస్తామని అనుకోగలమా? అవును ఇది నిజం.. వర్మ ఇలాంటి లుక్ లో తిరుపతిలో ప్రత్యక్ష్యమై అందరికీ షాకిచ్చారు. వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు, దేవుడు పేరు చెబితే ఇంతెత్తున లేస్తారు, పక్కా నాస్తికుడినని చెప్పుకుంటారు. అటువంటి ఆయన దేవుడి గుడిలో ప్రత్యక్షమైతే, స్వామి వారి ప్రసాదాన్ని చేతిలో పట్టుకుని దర్శనమిస్తే... ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రత్యేకతే అది. ఏది చేసినా తనదైన స్టైల్‌లో చేస్తారు. తాను నాస్తికుడినని చెప్పుకునే రామ్‌గోపాల్‌ వర్మ ఒకే రోజు రెండు ప్రముఖ దేవాలయాలను దర్శించుకున్నారు.

ఒకటి ప్రఖ్యాత కాణిపాకం వినాయకుని గుడి, రెండోది తిరుమల శ్రీవారి ఆలయం. గురువారం తాను తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని ట్వీట్‌ చేసిన వర్మ అన్నట్లుగానే స్వామిని దర్శించుకున్నారు. నుదుట సిందూరం, చేతిలో స్వామి వారి లడ్డూ, సంప్రదాయ వస్త్రధారణతో దిగిన ఫొటోలు పోస్టు చేసి తనదైన శైలిని చాటుకున్నారు. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం దివంగత ఎన్‌.టి.రామారావే తనను ఇలా మార్చేశారని కింద క్యాప్షన్‌ పెట్టి షాకిచ్చారు. జీవీ ఫిల్మ్స్‌ పతాకంపై రాకేష్‌ రెడ్డి నిర్మిస్తున్నఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఓ వీడియోను వర్మ విడుదల చేశారు.