సినిమా వార్తలు

ప్రభాస్‌కు రియల్ లైఫ్ విలన్స్ గురించి చెప్పిన హైకోర్టు


8 months ago ప్రభాస్‌కు రియల్ లైఫ్ విలన్స్ గురించి చెప్పిన హైకోర్టు

హీరో ప్రభాస్‌కు చెందిన గెస్ట్ హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన సంగతి విదితమే. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధి సర్వే నెం.46లోని స్థలం ప్రభుత్వం స్థలంగా గుర్తిస్తూ సుప్రీం కోర్టు తీర్పుఇవ్వడంతో అధికారులు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివాదంలో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించగా, దీనికి సంబంధించిన వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు ప్రభాస్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘క్లయింట్(ప్రభాస్) రీల్ లైఫ్‌లో ఎంతోమంది విలన్లను ఎదుర్కొని ఉంటారు. కానీ రియల్ లైఫ్ విలన్లు భిన్నంగా ఉంటారు అనే విషయం కూడా ఆయన తెలుసుకోవాలి' అంటూ కోర్టు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

కాగా గెస్ట్ హౌస్ ఉన్నస్థలం ప్రభాస్‌ తండ్రి గతంలో కొనుగోలు చేశారు. దాని క్రమబద్ధీకరణ కోసం అధికారులకు ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభాస్ దరఖాస్తుపై ఏమాత్రం స్పందించకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గెస్ట్ హౌస్ సీజ్ చేసిన రెవెన్యూ అధికారుల తీరును కోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ శివారులోని రాయదుర్గం పరిధిలోని సర్వే నెం. 46 సర్వే నెంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉండగా పలువరు కొనుగోలు చేశారు. ఇందులో ప్రభాస్‌‌కు 2,200 గజాల్లో గెస్ట్ హౌస్ ఉంది. ఇది ప్రభుత్వ స్థలమని అధికారులు వాదిస్తుంటే ఇది తమదేనని ఇక్కడ స్థలాలు ఉన్నవారు అంటున్నారు. ఇదిలావుండగా ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' ఆగస్టు 15, 2019లో విడుదల కానుంది.