సినిమా వార్తలు

మహేష్ కార్యాలయంపై జీఎస్టీ అధికారుల దాడులు


5 months ago మహేష్ కార్యాలయంపై జీఎస్టీ అధికారుల దాడులు

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వస్తుసేవల పన్ను(జీఎస్టీ) అధికారులు నోటీసులు పంపారు. ఈ నేపధ్యంలో మహేశ్ బాబు కార్యాలయంపై  దాడులు చేపట్టారు. 2007-08 ఆర్థిక సంవత్సరంలో మహేశ్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా మొత్తం రూ.18.5 లక్షల సేవా పన్నును మహేష్ చెల్లించాల్సి ఉంది. దీంతో పన్నులు, వడ్డీ, జరిమానా మొత్తం కలిపి రూ. 73.5 లక్షలు రికవరీ చేసేందుకు జీఎస్టీ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుల్లోని మహేశ్ బాబు ఖాతాలను అటాచ్ చేస్తూ జీఎస్టీ కమిషనర్ నిన్న ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా హైదరాబాదులోని మహేశ్ బాబు ఆఫీసుపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించారు.

మహేశ్ ఆఫీసుకు చేరుకున్న అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ విషయమై జీఎస్టీ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఈ పన్ను వివాదంపై మహేశ్ బాబు ఛార్టర్డ్ అకౌంటెంట్ ఒకరు గతంలో పన్ను వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించారన్నారు. అక్కడ  చిక్కెదురు కావడంతో మహేశ్ హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. అక్కడ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో తాజాగా జీఎస్టీ అధికారులు చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. యాక్సిస్ బ్యాంకులో మహేశ్ ఖాతాలో ఉన్న రూ.43 లక్షలను స్వాధీనం చేసుకున్నామనీ, ఇంకో 30.5 లక్షలను వసూలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు