సినిమా వార్తలు

దర్శకుడు క్రిష్‌కు గురజాడ విశిష్ట పురస్కారం


11 months ago దర్శకుడు క్రిష్‌కు గురజాడ విశిష్ట పురస్కారం

ఈరోజు మహాకవి గురజాడ 103వ వర్ధంతి. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలోగల గురజాడ సాంస్కతిక సమాఖ్య ఆధ్వర్యాన గురజాడ సాహితీ చైతన్యోత్సవం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురజాడ స్వగృహంలో జ్యోతి ప్రజ్వలన, అనంతరం కవులు, కళాకారులు, కళాభిమానులు, విద్యార్ధులు, గురజాడ వాడిన వస్తువులతో పాదయాత్ర నిర్వహించారు. గురజాడ అప్పారావు వర్థంతి సందర్భంగా క్రిష్ గురజాడ పురస్కారాన్ని ఈ రోజు అందుకోనున్నారు.

ప్రస్తుతం క్రిష్ ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా మారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. మొదటి పార్ట్ ఎన్టీఆర్ సినీ జీవితాన్ని ఆవిష్కరిస్తే, రెండోది రాజకీయ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా గురజాడ వర్దంతి సందర్బంగా నిర్వహించే సదస్సును గురజాడ ముని మనమడు వెంకటేశ్వర ప్రసాద్‌ ప్రారంభించనున్నారు.

ప్రముఖ సాహితీ వేత్తలు జగద్దాత్రి, డాక్టర్‌ వెలమల సిమ్మన్న, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ హాస్యబ్రహ్మ డాక్టర్‌ శంకర్‌ నారాయణ్‌ కార్యక్రమంలో గురజాడ రచనల విశిష్టత వివరించినున్నారు. విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ప్రముఖ సందేశాత్మక చిత్రదర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌)కు గురజాడ విశిష్ట పురస్కారం అందించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పద్మభూషణ్‌ డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, గౌరవ అతిథిగా సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, బుర్రా సాయి మాధవ్‌ హాజరుకానున్నారు.  అనంతరం ఈపు విజయకుమార్‌ దర్శకత్వంలో విజయనగరానికి చెందిన ఔత్సాహక మహిళలు కన్యాశుల్కం నుంచి కొన్ని సన్నివేశాలను ప్రదర్శించనున్నారు