సినిమా వార్తలు

‘మహర్షి’వాయిదాకు దిల్ రాజు చెప్పిన వింతకారణం


8 months ago ‘మహర్షి’వాయిదాకు దిల్ రాజు చెప్పిన వింతకారణం

మహేష్  సినిమా అనగానే జానర్ ఏదైనా సరే అంచనాలు అమాంతం పెరిగిపోతాయి. అందులోనూ క్రేజీ కాంబినేషన్ అంటే ఇక చెప్పనవసరం లేదు. అయితే ఏప్రిల్ 5 విడుదలని చెబుతూ వచ్చిన మహర్షి టీం ఇప్పుడు హటాత్తుగా మాట మార్చింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ బాగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నుంచే సోషల్ మీడియాలో వంద రోజుల కౌంట్ డౌన్ అంటూ మొదలు పెట్టి విడుదల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడా ఆశల మీద నీళ్లు కుమ్మరించినట్లయ్యింది. అయితే దీనికి నిర్మాత దిల్ రాజు వింత కారణం చెబుతున్నారు. ఏప్రిల్ మొదటివారం కంటే చివరి వారం అయితేనే సెంటిమెంట్ గా మహేష్ కు కలిసి వస్తుందని చెబుతున్నారు.

దీనికి గత ఏడాది వచ్చిన భరత్ అనే నేనుని ఉదాహరణంటున్నారు. అయితే అది వచ్చింది మూడో వారంలో. పోకిరిని కూడా ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. సినిమాకు ముగ్గురు నిర్మాతలున్నా కీలకమైన బాధ్యతలు వహిస్తున్న దిల్ రాజు టీమ్ చెబుతున్న దానిలో లాజిక్ మిస్ అవుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాలకు సీజన్ తో సంబంధం ఉండదు. కంటెంట్ ఉంటే ఎప్పుడు వచ్చినా దుమ్ము రేపుతుంది. ఇది హీరోలందరికీ  వర్తిస్తుంది. రంగస్థలం మార్చి చివరి వారంలో వచ్చి, నాన్ బాహుబలి రికార్డులను అధిగమించింది. దీనికి దర్శకుడు వంశీ పైడిపల్లి వహిస్తున్న జాప్యం తప్ప మరొకటి కారణం కాదని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయినా సెంటిమెంట్ల ప్రకారం డేట్లు చూసుకోవడం సహజమే కానీ మరీ ఫలానా టైంలోనే వస్తే హిట్ అవుతాయి అని చెప్పుకోవడం మాత్రం లాజిక్ కి అందడం లేదంటున్నారు. తాజాగా ‘మహర్షి’ విడుదల ఏప్రిల్ 26 అంటూ చెబుతున్నారు.