సినిమా వార్తలు

అన్నీవున్నా అర్హత కోలిపోయిన ‘కంచరపాలెం’?


8 months ago అన్నీవున్నా అర్హత కోలిపోయిన  ‘కంచరపాలెం’?

2018లో విడుదలైన తెలుగు సినిమాలలో కేరాఫ్ కంచరపాలెం మంచి పేరు సంపాదించింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఉత్తమ చిత్రంగా కేరాఫ్ కంచరపాలెం నిలిచింది. అయితే ఇప్పుడు కేరాఫ్ కంచరపాలెం సినిమాకు జాతీయ అవార్డుల నామినేషన్ రూపంలో నిరాశ ఎదురైంది. ఈ సినిమాను జాతీయ అవార్డులకు నామినేట్ చేయడాన్ని తిరస్కరిస్తూ నేషనల్ అవార్డ్స్ జ్యూరీ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాకు అమెరికా పౌరసత్వం కలిగిన ఓ భారత సంతతి వ్యక్తి నిర్మాతగా వ్యవహరించడం వల్లే తిరస్కరిస్తున్నామని జ్యూరీ వివరించింది. కేరాఫ్ కంచరపాలెం సినిమాను ప్రవీణ పరుచూరి నిర్మించారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తీవ్రంగా చింతించారు.

తన ఆవేదనను ట్విట్టర్ సాక్షిగా వ్యక్తం చేశారు. దర్శకుడు వెంకటేష్ మహాకు క్షమాపణ చెబుతున్నానని, ఆయన పడిన కష్టం, టాలెంట్ గుర్తింపునకు నోచుకోలేకపోవడానికి కారణం తానేనని ఆమె ట్వీట్ చేశారు. తానే అతనిని ఫెయిల్ చేశానని ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె ట్వీట్‌పై చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా స్పందించారు. తన సినిమాను జ్యూరీ తిరస్కరించడానికి కారణం ప్రవీణ ఎంతమాత్రం కాదని, కాలం చెల్లిన దేశ నియమనిబంధనలని పేర్కాన్నారు. ఒక ఇండియన్ డైరెక్టర్ తీసిన సినిమా, ఇండియన్ ఆడియన్స్ కోసం తీసిన సినిమా ఇండియన్ నేషనల్ అవార్డ్స్‌కు నామినేట్ అవ్వకపోవడమేంటో అర్థం కావడం లేదని వెంకటేష్ మహా విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి నిబంధనలు మారాల్సిన అవసరం ఉందని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.