సినిమా వార్తలు

చిరంజీవి బ‌యోపిక్‌...చ‌ర‌ణ్ హీరో?


8 months ago చిరంజీవి బ‌యోపిక్‌...చ‌ర‌ణ్ హీరో?

'మహానటి సినిమా అనంత‌రం వరుస బయోపిక్ చిత్రాలు మొదలయ్యాయి. ఎన్టీఆర్‌, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన చిత్రాలు ఇప్ప‌టికే థియేటర్లలో సందడి చేశాయి. అయితే  మ‌హాన‌టి స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ విజ‌య‌వంతం కాలేదు. వైఎస్ఆర్ మూవీ ఓ మోస్తరుగా రన్ అవుతోంద‌ని అంటున్నారు.ఈ నేప‌ధ్యంలోనే చిరంజీవి బ‌యోపిక్ పై వార్త‌లు వినిపించాయి. వీటిపై చిరు  సోదరుడు నాగబాబు స్పందిస్తూ అన్నయ్య జీవితంలో ఆసక్తికర మలుపులేమీ లేవు, అందుకే ఆయన జీవితంపై బయోపిక్ వస్తుందని అనుకోవ‌డంలేద‌న్నారు. అయితే నాగ‌బాబు అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించడం లేదు. అభిమానుల్లో చిరంజీవి జీవితంపై బయోపిక్ రావాలనే కోరిక బలంగా ఉంద‌ట‌. చిరంజీవి పాత్రలో రామ్ చరణ్ నటిస్తే చూడాలని వారు ఆశ‌ప‌డుతున్నార‌ట‌. ఎప్పటికైనా ఆయన జీవిత కథను తెరపై చూడాలని ఉందంటున్నారు.

చిరంజీవి జీవితంలో ఎన్నో ఆసక్తికర ఘటనలు ఉన్నాయని, ఎలాంటి అండ లేకుండా చిత్ర ప‌రిశ్ర‌మకు వ‌చ్చి చిన్న చిన్న పాత్రలు వేసి, ఆపై హీరోగా అవకాశాలు దక్కించుకున్నార‌ని చిరంజీవి గురించి చెబుతుంటారు. అప్పటి వరకు ఉన్న పెద్ద పెద్ద స్టార్లను తన టాలెంటుతో అధిగమించార‌ని, హార్డ్ వర్క్‌ను నమ్ముకుని నెం.1గా ఎదిగార‌ని అంటుంటారు. అలాగే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తి దాయకంగా ఉన్నాయ‌ని అభిమానులు కొనియాడుతుంటారు. అలాగే చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఆసక్తికరంగా ఉందంటున్నారు. అందుకే చిరంజీవి బయోపిక్ తీయ‌వ‌చ్చ‌ని అభిమానులు చెబుతున్నారు.