సినిమా వార్తలు

డిసెంబర్‌14న ‘భారతీయుడు-2’ ప్రారంభం


10 months ago డిసెంబర్‌14న ‘భారతీయుడు-2’ ప్రారంభం

ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌ సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలచిన చిత్రం ‘ఇండియన్‌’. తెలుగులో ‘భారతీయుడు’గా విడుద‌లై రికార్డులు సృష్టించిన విషయం విదిత‌మే. తమిళ దర్శకుడు ఎస్‌. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ఇండియన్‌-2 రాబోతోంది. తెలుగులో ఇది ‘భారతీయుడు-2’గా రానున్న‌ద‌ని స‌మాచారం. దీన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ వచ్చేనెల 14 నుంచి ప్రారంభం కానుంది.ఈ మేరకు చిత్రవర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నాయ‌ని తెలుస్తోంది. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రాన్ని తెరకెక్కించాలని చిత్ర బృందం త‌ల‌పోస్తోంది. బిగ్గెస్ట్‌ మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ‘భారతీయుడు’ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వం వహించారు.

ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వం వహించిన ‘రోబో 2.ఓ’ విడుదలైంది.సూపర్‌ స్టార్‌ రజినీ కాంత్‌, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంటోంది. దాదాపు రూ.550కోట్ల బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్‌ ఈచిత్రాన్ని నిర్మించింది. శంకర్‌ తదుపరి చిత్రం ‘భారతీయుడు-2’ని కూడా ఇదే సంస్థ నిర్మించనున్న‌ద‌ని తెలుస్తోంది.