సినిమా వార్తలు

‘ఎన్టీఆర్’లో బాలయ్య ఉన్నట్టా? లేనట్టా?


7 months ago ‘ఎన్టీఆర్’లో బాలయ్య ఉన్నట్టా? లేనట్టా?

దివంగత ఎన్టీరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సంచలనాలు నమోదు చేసింది. స్వల్ప వ్యవధిలోనే లక్షలాదిమంది దీనిని వీక్షించారు. అంతేకాదు, ఈ ట్రైలర్ అంచనాలను మరింత పెంచేలావుంది. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా నటిస్తుండగా, హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా తదితరులు నటిస్తున్న విషయం విదితమే. ఇంతవరకు బాగానే ఉన్నా, మరి బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్న చర్చ ఇప్పుడు  మొదలైంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ కూడా ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు, ఇటీవల విడుదలైన ట్రైలర్‌లోనూ బాలకృష్ణ క్యారెక్టర్ కనిపించలేదు.

ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఉండగా, బాలకృష్ణ మాత్రం కనిపించడం లేదు. దీంతో, ఇంతకీ ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర ఉందా? లేదా? అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తండ్రితో కలిసి బాలకృష్ణ పలు పౌరాణిక చిత్రాల్లో నటించారు. కాగా, ఈ సినిమాలో బాలకృష్ణ పాత్రను జూనియర్ ఆర్టిస్టులతో పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే, మరికొందరి వాదన మాత్రం ఇంకోలా వినిపిస్తోంది. బాలకృష్ణ పాత్రను బాలకృష్ణే చేశారని, ఆయన ద్విపాత్రాభినయం చేశారని చెబుతున్నారు. బాలకృష్ణ పాత్రలో ఆయన తనయుడు మోక్షజ్ఞ నటించినట్టు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తలను యూనిట్ ఖండంచింది.