సినిమా వార్తలు

చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ లో బాబు అదుర్స్‌


7 months ago చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ లో బాబు అదుర్స్‌

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘చంద్రోదయం’. పి.వెంకటరమణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర నిర్మిస్తున్న ఈ బయోపిక్  ఫస్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. చంద్రబాబునాయుడు ఓ లివింగ్ లెజెండ్ అని, దేశ చరిత్రలో ఆయనొక అరుదైన, ఆదర్శవంతమైన నాయకుడని దర్శకుడు వెంకటరమణ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సామాన్య కుటుంబంలో జన్మించి అగ్రస్థానానికి ఎదిగిన చంద్రబాబు జీవితం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ‘చంద్రోదయం’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ చిత్రం చిత్రీకరణ చివరిదశలో ఉందని, వినోద్ నువ్వుల చంద్రబాబు పాత్రలో నటిస్తున్నాడని చెప్పారు. చంద్రబాబు వంటి మహానాయకుడి బయోపిక్ ను తాము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామని, వచ్చే నెలలో పాటలను, ఆ తర్వాత ఈ సినిమా విడుదల చేస్తామని  నిర్మాత జీజే రాజేంద్ర తెలిపారు. నారావారిపల్లె, తిరుపతి, హైదరాబాద్, అమరావతి, సింగపూర్ తదితర లొకేషన్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరించామని, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబునాయుడు పాత్రలో నటిస్తున్న వినోద్ నువ్వుల లుక్ ను విడుదల చేశామని అన్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంగా వినోద్‌ సంతోషం వ్యక్తం చేశాడు. చంద్రబాబు పాత్రలో తాను నటించడం తన పూర్వజన్మ సుకృతమని, అందరి ఆశీర్వాదాలతో, సహాయ సహకారాలతోనే ఇది తనకు సాధ్యమమైందని అనుకుంటున్నానని అంటూ ఓ పోస్ట్ చేశారు.