సినిమా వార్తలు

‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదల


1 year ago ‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదల

ఎన్టీఆర్‌ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ‘అరవింద సమేత’ ట్రైలర్‌ విడుదలయింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమన్‌ బాణీలు అందిస్తున్నారు. అక్టోబరు 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్‌ రాయలసీమ కుర్రాడిగా సందడి చేయబోతున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తికరంగా ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. ‘మీ పేరు..’ అని ఎన్టీఆర్‌ అడిగిన ఒక్క ప్రశ్నకు పూజా హెగ్డే ‘చాలా.. అడ్రెస్‌, ఫోన్‌ నెంబర్‌ కూడా కావాలా?’ అని సమాధానం ఇచ్చే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభం అయ్యింది. ‘నేను ఊరికే అడిగానండీ..’ అని ఆయన‌ చెబితే.. ‘నేను ఊరికే చెప్పనండీ’ అన్నారామె. ‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్‌ రాయలసీమ పౌరుషం చూపించారు. ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ‘సర్‌ వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్‌. తవ్వి చూడండి’ అంటూ ఎన్టీఆర్‌ చివర్లో భావోద్వేగంతో అనే మాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌తో పాటు, కల్యాణ్ రామ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లైవ్‌లో పాటలను వినిపించారు. అందులో భాగంగా ‘ఏడపోయినాడో..’ అనే పాట ప్లే అవుతున్నప్పుడు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కన్నీటి పర్యంతమయ్యారు. కారణం.. చిత్రంలో ఈ పాట చనిపోయిన మనిషి అంత్యక్రియల సందర్భంలో వస్తుంది. ఇటీవల తన తండ్రిని యాక్సిడెంట్‌లో పోగొట్టుకున్న వీరిద్దరూ.. ఈ పాట ప్లే అవుతున్నప్పుడు.. తండ్రిని గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.