సినిమా వార్తలు

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ న‌టుడు నేర్చుకున్న గుణ‌పాఠం


9 months ago 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ న‌టుడు నేర్చుకున్న గుణ‌పాఠం

30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ  అంటూ ఆక‌ట్టుకునే డైలాగుల‌తో పేరొందిన కమెడియన్ పృథ్వీ సుదీర్ఘ కాలంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉంటూ ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూశారు. ఇటీవ‌ల ఆయ‌న  ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగ‌తులు ఇండస్ట్రీలోని పరిస్థితికి అద్దం పడుతాయి. సీనియర్ నటుడు హరనాథ్ గురించి పృథ్వీ వివ‌రించారు.  తాను సీరియల్స్ లో నటించే సమయంలో పద్మాలయ స్టూడియోస్ కు షూటింగ్ కు వెళ్లే వాడిన‌ని అక్కడ ఒక రోజు గేటు ముందు గడ్డం పెరిగి చిరిగిన షర్ట్ వేసుకుని ఒక వ్యక్తి క‌నిపించాడ‌న్నారు. ఆయన‌ను పద్మాలయ గేటు వద్ద ఆపి సిబ్బంది లోనికి వెళ్లనివ్వడం లేదు. ఆయన్ను నేను గుర్తు పట్టి దగ్గరకు వెళ్లి ప‌ల‌క‌రించాను. మీరు హరనాథ్ గారు కదా అని ప‌ల‌కరించ‌గానే అవును అని సమాధానం ఇచ్చారు.

కృష్ణ గారిని కలవాలని వచ్చానంటూ చెప్పారు. దీంతో నేను లోనికి తీసుకు వెళ్లాను. స్టూడియోలోకి వెళ్లిన తర్వాత కృష్ణగారు చెప్పిన మీద‌ట‌ ఆయనకు స్నానం చేయించి కృష్ణ గారి దుస్తులు వేశారు. ఆ తర్వాత కృష్ణగారు వచ్చి హరనాథ్ గారిని ప‌లుక‌రించారు. వారం రోజుల పాటు కృష్ణ గారు హరనాథ్ గారిని తనతోనే ఉండ‌మ‌న్నారు. ఆ తర్వాత చెన్నైకు పంపించారు. హరనాథ్ గారు చెన్నైకి వెళ్లిన రెండు రోజులకే కాలంచెందారు. హరనాథ్ గారి జీవితం మాలాంటి వారికి ఎప్పిటికీ గుర్తుంచుకోవల‌సిన గుణపాఠం. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని హరనాథ్ గారిని చూస్తే తెలుస్తుంద‌ని పృథ్వీ ఈతరం న‌టుల‌కు  గొప్ప సందేశం ఇచ్చారు.