సినిమా వార్తలు

‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’


11 months ago ‘వచ్చిండే’ పాటకు 15కోట్లమంది ‘ఫిదా’

 ‘ఫిదా’తో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయిపల్లవి. తొలి చిత్రంతోనే ఆమె ప్రేక్షకుల్ని కట్టిపడేశారు. తెలంగాణ అమ్మాయిగా కనిపించి, మెప్పించారు. అంతేకాదు ఈ సినిమాకు సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పుకొన్నారు. ఈ సినిమాలో ‘వచ్చిండే’ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ పాటను ఇప్పటి వరకు 150 మిలియన్ల మంది చూశారని శేఖర్‌ కమ్ముల ఫేస్‌బుక్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ‘150 మిలియన్‌ మార్క్‌ దాటిన తొలి తెలుగు పాట ‘వచ్చిండే’.. మీ అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు.. ఈ మ్యాజిక్‌లో భాగమైన ‘ఫిదా’ బృందానికి శుభాకాంక్షలు’ అని ఆయన పేర్కొన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ కథానాయకుడు. దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికాలో చక్కటి వసూళ్లు రాబట్టింది. అంతేకాదు ఉత్తమ నటి, గాయకుడు, గాయని(‘వచ్చిండే’ పాటకు), డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకుంది. అమెరికాలో పెరిగిన అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య చిగురించిన ప్రేమ కథే ‘ఫిదా’. కాగా కథానాయకుడు విక్రమ్‌ కుమారుడు ధృవ్‌ హీరోగా తెరకెక్కించనున్న సినిమాకు శేఖ‌ర్ క‌మ్ముల‌ దర్శకత్వం వహించనున్నట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.